“నల్ల మబ్బులు కమ్ముకున్న ఆకాశాన్ని ఈదుకుంటా ఎర్రకొంగల గుంపొకటి పడమటి దిక్కుకు ఎగురుకుంటూ వెళ్ళిపోయాక వాటి వెనుకే… రంగురంగుల ఇంద్రధనస్సు పువ్వొకటి అంబరం సిగలోకి మొల్చుకొస్తుంది. మోడాలు కరిగి చినుకు మొగ్గల్ని రాల్చుతున్నప్పుడు బడి వుంటుందో, వుండదో తెలియని సందిగ్ధాన్ని మోస్తూ ఆ రెండుజడల నీలికళ్ళ పిల్ల అమ్ములు భుజానికి పుస్తకాల సంచి తగిలించుకొని మట్టిదారెంబడి పూలతోట మీదుగా పాఠశాలకు పయనమౌతుంది. రాత్రి అమ్మ చెప్పిన ఏడు గుర్రాలరాజు కథను తన నేస్తాలకు చెబుతూ అప్పుడప్పుడూ కొన్ని తూచ్‌లతో; అప్పుడప్పుడూ కొన్ని కచ్చీలతో నడక శ్రమ తెలియకుండా బడికి చేరుకుంటుంది.
“రాత్రి పలకకు రెండువైపులా రాసిన గుణింతాలు ఎక్కడ చెరిగిపోతాయోనని గుప్తనిధి నుంచి వెలికితీసే ఆభరణంలా ఆ పలకను సంచి నుంచి బయటకు తీస్తుంది. అయినా అక్కడక్కడ తుడిచిపోయిన అక్షరాలకు మళ్లీ కొత్తపూత పూస్తుంది మహావైద్యురాలిలా! మధ్యాహ్నం కూడా బడికిరాని టీచర్‌కు లోలోపలే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంటికొచ్చేసి పుస్తకాలను చక్కగా గూట్లో సర్దేసి గంగమ్మ గుడి… తూరుపుకొమ్మల చింతచెట్టు ఊయల దగ్గరికి చేరుకొని పిల్లలందరూ వంతులువారిగా ఊగుతారు. కాళ్ళు అందకపోయినా ఉబలాటం కొద్దీ కాసేపు ముల్లోకాలను తిరిగొచ్చిన అనుభూతి పొందుతారు.
“సాయంసంధ్య వేళ మార్గమధ్యంలో ఆకాశంకేసి చూసి గూళ్ళకు చేరుకోవడానికి వెళ్తున్న కొంగలగుంపు వెనక ‘కొంగా కొంగా పాలుపొయ్!’ అంటూ అమ్ములు కొంతదూరం పరిగెడుతుంది. ఆ పక్షుల మందలు కన్పించకుండా కొండదారి పట్టినంత వరకు చూస్తూ కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదారి పడుతుంది. దీపాలవేళ గుడ్డిదీపం ముందు కుదురుగా కూర్చొని పదాలను కలిపి చదవడానికి ప్రయత్నించి ‘ఛా… ఇంగ్లీష్’ అంటూ కాసేపు మౌనంగా దిగులు పడుతుంది. తన చిన్న కడుపులోకి అమ్మ వడ్డించిన ఆహారం ఇంత సర్దుకొని విశ్రమించడానికి ఉపక్రమిస్తుంది. ఆకాశంలోని చందమామను అద్దం పలకలో పట్టుకొని కాసేపు ఆడుకున్న తర్వాత ఎక్కడినుంచో ఎగురుతూ వచ్చి తన గౌనుపై వాలిన మిణుగురు పురుగుతో కొత్త దోస్తీ కడుతుంది. ఆవలింతల నిద్ర కమ్ముకొస్తున్నప్పుడు అమ్మనాన్నల మధ్యన వెచ్చగా నిద్రస్తూ రెండు కళ్ళలోనూ కోటి కలలను సాగుచేస్తూ తెల్లవారేదాక శ్రమించి అలసటతో నిద్రలేస్తుంది. అప్పుడే విరిసిన నీలం పువ్వులా! అలాంటి అమ్ములు ఇప్పుడు ఎక్కడికెళ్ళింది?”
ఎక్కడికెళ్ళిందో తెలియాలంటే సాహిత్య నేత్రం ఉత్తమ కథా పురస్కార పోటీలు – 2007లో జనరల్ కేటగిరి కింద ద్వితీయ బహుమతి పొందిన కథ తూరుపు కొమ్మలు చదవండి.