అద్దేపల్లి రామమోహనరావు గారి ఇంటర్వ్యూ, దానితోబాటే రాయలసీమ గ్రామ పార్టీల గురించి పాలగిరి విశ్వప్రసాద్ రాసిన “చుక్క పొడిచింది” కథకు రాచపూటి రమేశ్ ఆంగ్లానువాదం The Dawn చదవండి.
అద్దేపల్లి ఇంటర్వ్యూ, చుక్కపొడిచింది కథానువాదం
December 1st, 2008కవితా నేత్రం
November 20th, 2008బండ్ల మాధవరావు “గుప్పిట్లో భూగోళం“, డా. కాసుల లింగారెడ్డి “మూడు ప్రేమలు – ఒకే మరణం“, దోర్నాదుల సుబ్బమ్మ “మెరుపు“, డా. రూప్‌కుమార్ డబ్బీకార్ “సగం తెరిచిన కిటికీ” కవితలను కవితానేత్రంలో చదవండి.
ఆరు పదుల తెలుగు కవిత
November 4th, 2008“ఉత్తమ సాహిత్యానికి జన్మస్థానం, గమ్యస్థానం సమాజమే” అన్నారు రా.రా. (రాచమల్లు రామచంద్రారెడ్డి). ఏ కాలంలో వెలువడిన సాహిత్యం, సాహిత్యధోరణులు తప్పనిసరిగా ఆ కాలంలోని సమాజ ధోరణులను ప్రతిబింబిస్తాయి. తెలుగు కవిత్వం కూడా అందుకు మినహాయింపు కాదు. గడచిన ఆరు దశాబ్దాల్లో తెలుగు కవిత్వంలో వచ్చిన ధోరణులు, విప్లవాలు, వాటిని ప్రేరేపించిన చారిత్రిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల గురించి ప్రసిద్ధ సాహితీ విశ్లేషకులు డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి వ్యాసం “ఆరు పదుల తెలుగు కవిత” నేత్రంలో చదవండి.
బెజవాడ గోపాలరెడ్డితో ఇంటర్వ్యూ, ప్రథమ బహుమతి కథ
October 28th, 2008జ్ఞానపీఠ్ అవార్డుల గురించి ఈ మధ్య తెలుగు బ్లాగుల్లో విరివిగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ అవార్డుల కమిటీకి అధ్యక్షులుగా పనిచేసిన తెలుగువారి అభిప్రాయాలు తెలుసుకోవడం పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుంది. సాహిత్యనేత్రం పత్రికలో బెజవాడ గోపాలరెడ్డి శతజయంతి సందర్భంగా జూలై 2007 సంచికలో ప్రచురించిన ఇంటర్వ్యూను మా వెబ్సైటులో ప్రచురించాం. తెలుగుసాహితీవేత్తల్లో దీపధారుల గురించి, జ్ఞానపీఠ్ అవార్డుల గురించి, రవీంద్రభారతి గురించి, అనేక ఇతర విషయాల గురించి ఆయన ఏం చెప్పారో చదవండి.
దానితోబాటే సాహిత్య నేత్రం ఉత్తమ కథా పురస్కార పోటీలు – 2007లో జనరల్ కేటగిరి కింద ప్రథమ బహుమతి పొందిన పి. చంద్రశేఖర ఆజాద్ కథ భూమి కూడా ప్రచురించాం.
ఇనుప గజ్జెల తల్లి, ఇతిహాసం
October 24th, 2008అనంతపురం జిల్లా రచయితలు కరువు గురించి రాసిన కథలతో సింగమనేని నారాయణ, శాంతి నారాయణ గార్ల సంపాదకత్వంలో వెలువడిన “ఇనుప గజ్జెల తల్లి” కథాసంకలనంపై చంద్రలత గారి విశ్లేషణ Realistic fiction : A Narration of Drought (ఆంగ్లంలో), సాహిత్య నేత్రం ఉత్తమ కథా పురస్కార పోటీలు – 2007లో జనరల్ కేటగిరి కింద ద్వితీయ బహుమతి రూ. 3,000/-లు పొందిన వి. పోతన్న గారి కథ “ఇతిహాసం” చదవండి.
గుండె గొంతులో కొట్లాడతాది
October 22nd, 2008”పద్దన్నే లేసినాడు కాదరయ్యా” అనే పాట వినబడగానే ”జక్కీక ఏస్తాండరు. పాపను తట్టు… నిద్రపోతాది” అంటూ భర్త పక్కన పాపను పడుకోబెట్టి తిరిగి వీధిలోకి పరుగు తీసేది రాధ. అంతగా ఆటపాటలతో జీవితం పెనవేసుకుపోయిన రాధ ఇప్పుడు తన కూతుళ్లను ఆటలు-పాటలు కాదుగదా ఇరుగుపొరుగులతో కూడా కలవనివ్వకుండా కట్టడి చేసేలా మార్చిన పరిస్థితులు, అనుభవాలు ఎటువంటివి? గుండె లోతుల్లోంచి పెల్లుబికే భావాలు నోరుదాటి బయటికి రాలేక, వెనక్కి మళ్లలేల గొంతులో కొట్లాడడమెందుకు? సాహిత్య నేత్రం ఉత్తమ కథా పురస్కార పోటీలు – 2007లో జనరల్ కేటగిరి కింద ద్వితీయ బహుమతి పొందిన సుంకోజి దేవేంద్రాచారి కథ “గుండె గొంతులో కొట్లాడతాది” చదవండి.
అమ్ములు ఎక్కడికి వెళ్లింది?
October 16th, 2008“నల్ల మబ్బులు కమ్ముకున్న ఆకాశాన్ని ఈదుకుంటా ఎర్రకొంగల గుంపొకటి పడమటి దిక్కుకు ఎగురుకుంటూ వెళ్ళిపోయాక వాటి వెనుకే… రంగురంగుల ఇంద్రధనస్సు పువ్వొకటి అంబరం సిగలోకి మొల్చుకొస్తుంది. మోడాలు కరిగి చినుకు మొగ్గల్ని రాల్చుతున్నప్పుడు బడి వుంటుందో, వుండదో తెలియని సందిగ్ధాన్ని మోస్తూ ఆ రెండుజడల నీలికళ్ళ పిల్ల అమ్ములు భుజానికి పుస్తకాల సంచి తగిలించుకొని మట్టిదారెంబడి పూలతోట మీదుగా పాఠశాలకు పయనమౌతుంది. రాత్రి అమ్మ చెప్పిన ఏడు గుర్రాలరాజు కథను తన నేస్తాలకు చెబుతూ అప్పుడప్పుడూ కొన్ని తూచ్‌లతో; అప్పుడప్పుడూ కొన్ని కచ్చీలతో నడక శ్రమ తెలియకుండా బడికి చేరుకుంటుంది.
“రాత్రి పలకకు రెండువైపులా రాసిన గుణింతాలు ఎక్కడ చెరిగిపోతాయోనని గుప్తనిధి నుంచి వెలికితీసే ఆభరణంలా ఆ పలకను సంచి నుంచి బయటకు తీస్తుంది. అయినా అక్కడక్కడ తుడిచిపోయిన అక్షరాలకు మళ్లీ కొత్తపూత పూస్తుంది మహావైద్యురాలిలా! మధ్యాహ్నం కూడా బడికిరాని టీచర్‌కు లోలోపలే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంటికొచ్చేసి పుస్తకాలను చక్కగా గూట్లో సర్దేసి గంగమ్మ గుడి… తూరుపుకొమ్మల చింతచెట్టు ఊయల దగ్గరికి చేరుకొని పిల్లలందరూ వంతులువారిగా ఊగుతారు. కాళ్ళు అందకపోయినా ఉబలాటం కొద్దీ కాసేపు ముల్లోకాలను తిరిగొచ్చిన అనుభూతి పొందుతారు.
“సాయంసంధ్య వేళ మార్గమధ్యంలో ఆకాశంకేసి చూసి గూళ్ళకు చేరుకోవడానికి వెళ్తున్న కొంగలగుంపు వెనక ‘కొంగా కొంగా పాలుపొయ్!’ అంటూ అమ్ములు కొంతదూరం పరిగెడుతుంది. ఆ పక్షుల మందలు కన్పించకుండా కొండదారి పట్టినంత వరకు చూస్తూ కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదారి పడుతుంది. దీపాలవేళ గుడ్డిదీపం ముందు కుదురుగా కూర్చొని పదాలను కలిపి చదవడానికి ప్రయత్నించి ‘ఛా… ఇంగ్లీష్’ అంటూ కాసేపు మౌనంగా దిగులు పడుతుంది. తన చిన్న కడుపులోకి అమ్మ వడ్డించిన ఆహారం ఇంత సర్దుకొని విశ్రమించడానికి ఉపక్రమిస్తుంది. ఆకాశంలోని చందమామను అద్దం పలకలో పట్టుకొని కాసేపు ఆడుకున్న తర్వాత ఎక్కడినుంచో ఎగురుతూ వచ్చి తన గౌనుపై వాలిన మిణుగురు పురుగుతో కొత్త దోస్తీ కడుతుంది. ఆవలింతల నిద్ర కమ్ముకొస్తున్నప్పుడు అమ్మనాన్నల మధ్యన వెచ్చగా నిద్రస్తూ రెండు కళ్ళలోనూ కోటి కలలను సాగుచేస్తూ తెల్లవారేదాక శ్రమించి అలసటతో నిద్రలేస్తుంది. అప్పుడే విరిసిన నీలం పువ్వులా! అలాంటి అమ్ములు ఇప్పుడు ఎక్కడికెళ్ళింది?”
ఎక్కడికెళ్ళిందో తెలియాలంటే సాహిత్య నేత్రం ఉత్తమ కథా పురస్కార పోటీలు – 2007లో జనరల్ కేటగిరి కింద ద్వితీయ బహుమతి పొందిన కథ తూరుపు కొమ్మలు చదవండి.
బ్రౌన్ దొర చుట్టం, పూణే ప్రయాణం
October 7th, 2008తెలుగు సూర్యుడుగా పేరుపొందిన ఆంగ్లేయ అధికారి సి.పి.బ్రౌన్. చిన్నప్పటి నుంచి ఆయన గొప్పదనం గురించి, తెలుగుభాషకు ఆయన చేసిన మహోపకారం గురించి, తెలుగు భాష అందచందాలను గురించి విని, చదివి ఆ బ్రౌను దొర నడయాడిన తెలుగు నేలను చూడాలని, తెలుగు భాషను చెవులారా విని ఆనందించాలని, తెలుగువారి ఆచారవ్యవహారాలు, కట్టు, బొట్టు, సంస్కృతీసంప్రదాయాలను తన స్నేహితురాలికి స్వయంగా పరిచయం చేసి ఆమెను ముగ్ధురాలిని చేయాలని ఉవ్విళ్ళూరుతూ రాష్ట్రానికి వస్తాడు బ్రౌన్ దొరకు దగ్గరి చుట్టమైన ఒక యువకుడు. తీరా ఇక్కడికొచ్చాక అతడికెదురైన అనుభవాలెటువంటివి? అతడి మాటల్లోనే వినండి: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి కథ తెలుగు పతాకంలో.
పూణేలో మగ్గిపోతున్న వ్యభిచారుల జీవితం గురించి ప్రముఖ కథారచయిత వేంపల్లి గంగాధర్ రాసిన ‘పూణే ప్రయాణం’ పుస్తకం గురించి సమీక్ష: వ్యదార్థ జీవుల జీవనయానం – పూణే ప్రయాణం
గాలి గంగమ్మ, ఊబి ఆంగ్లానువాదం
September 30th, 20082007 లో సాహిత్యనేత్రం వివిధ కేటగరీల్లో నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్న కథలను వెబ్సైట్లో ప్రచురించడం మొదలుపెట్టాం. ముందుగా 2007 (జూలై-సెప్టెంబర్) సంచికలోని సంపాదకీయం, అదే సంచికలో ప్రచురితమైన రెండు కథలు – స్త్రీవాద కథల పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన వి. ప్రతిమ గారి గాలి గంగమ్మ, దానితోబాటే సింగమనేని నారాయణ గారి ఊబి కథకు కీ.శే. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి ఆంగ్లానువాదం The Mire చదవండి.
నేత్రం తెరచుకొంది
September 29th, 2008గతంలో మేం ప్రకటించినట్లుగానే తెలుగులో మొట్టమొదటిసారిగా ఒక సాహిత్య పత్రిక పూర్తి కంటెంటును అంతర్జాలంలో అదీ యూనికోడ్ లో ఉచితంగా అందించే ప్రయత్నం మొదలుపెట్టాం. మా ఈ ప్రయత్నాన్ని సాహిత్యనేత్రం త్రైమాసిక పత్రిక ద్వితీయ కథల పోటీలో వివిధ కేటగరీల్లో బహుమతులందుకున్న కథలతో మొదలుపెడుతున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. ఈ వెబ్సైటును ఎప్పటికప్పుడు సాహిత్యనేత్రం వివిధ సంచికల్లోని రచనలతో తాజాకరిస్తూ ఉంటాం.
సాహిత్యనేత్రం వెబ్సైటులో మేం చేసే అప్డేట్ల గురించి ఈ బ్లాగు ద్వారా ఎప్పటికప్పుడుతెలుపుతూ ఉంటాం. సాహిత్యనేత్రం పాత సంచికల్లో కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, సమీక్షలు, సుప్రసిద్ధులతో చేసిన ఇంటర్వ్యూలు, సాహితీ సమావేశాలకు, సాహిత్యపరమైన విశేషాలకు సంబంధించిన వార్తలు – ఇలా దాదాపు పదహైదు వందల ఫుల్ స్కేప్ పేజీల అమూల్యమైన సాహిత్యం తెలుగులో మా దగ్గర ఉంది. వాటిని నెమ్మదిగా సచిత్రంగా అప్లోడు చెయ్యడం మొదలుపెట్టాం. మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం.
ఆర్కైవుల గురించి ఒకమాట: మేం ఈ వెబ్సైటును గత ఏడాదే మొదలుపెట్టినప్పటికీ మా పత్రిక పదేళ్ళ కిందటి నుంచే ఉంది. అందువల్ల సంచికలవారీగా చదువుకోవడానికి వీలుగా ఆర్కైవులు రచనలను అప్లోడు చేసిన తేదీలను బట్టి కాక పత్రిక యొక్క సంచికల తేదీలతో ఏర్పాటుచేశాం. ఈ ఆర్కైవులలో ఎప్పటికప్పుడు కొత్తగా చేర్చే రచనల గురించి ఈ బ్లాగులో ప్రకటిస్తాం.
మా ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని, మీ సలహాలు, సూచనలను అందిస్తారని ఆశిస్తున్నాం.